సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

ముందు మాట: ‘OLD IS GOLD’ ఈ కథ మనందరికీ తెలిసిందే అయినప్పటికీ మరొక సారి గుర్తుచేసుకుందాం.

               ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించు కోకుండ, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.

          ఒక రోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది. 

అది గమనించిన ఆవు భయపడక "పులిరాజా! ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగ దూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడ నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండ పాలు ఇచ్చి మంచిబుద్ధులు చెప్పి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.

               ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా! ఏమి మాయమాటలు. ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి తేటలు లేవనుకోకు, నేనేం వెర్రిదాన్ని కాను” కోపంగా అన్నది పులి. 

 
               “నీవు అలా అనుకోవడం సరి కాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా చివరి ఆశ” అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని 'సరే' అన్నది పులి. 

ఆవు ఇంటికిపోయి దూడకు కడుపునిండా పాలిచ్చి లేగదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా! బుద్ధిమంతుడుగా మంచితనముతో జీవించు. తోటి వారితో స్నేహంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోను కూడా అబద్ధాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో. ఎవరితోనూ గొడవ పెట్టుకోకు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ అపకారం చేయకు. శత్రువులకైనా ఉపకారమునే చేయి” అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. 

ఆవుని చూచిన పులికి ఆశ్చర్యం కల్గింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీనిని చంపి తింటే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి. 

          పులికి ధన్యవాదాలు తెలిపి పరుగు, పరుగున వచ్చి తన దూడను చేరింది ఆవు.


ఈ కథలోని నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే!!!



Comments

Post a Comment

Popular posts from this blog

5th Class MATHS Lesson Plan

5th Class Telugu Lesson Plans

5th Class E.V.S Lesson Plan